లివింగ్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగం: వినోద్ కుమార్

ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగానికి విశిష్టత ఉందని, లివింగ్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని మహాత్మాగాంధీ 'లా' కాలేజీలో జరిగిన '70 వసంతాల భారత రాజ్యాంగం' అనే సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ సమకాలీన పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తట్టుకొని నిలిచిందన్నారు. భారత రాజ్యాంగం చాలా గొప్పదని, స్వాతంత్ర్య పోరాటాల్లో అప్పటి పరిస్థితులను ఆకళింపు చేసుకున్న సందర్భంలో రాజ్యాంగాన్ని రచించారని ఆయన వివరించారు. పరిస్థితులకు అనుగుణంగా 103 సవరణలు చోటుచేసుకున్నట్లు తెలిపారు.


దేశ ప్రజలకు రాజ్యాంగం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉందని, అందుకే రాజ్యాంగానికి ఆ గౌరవం లభిస్తుందన్నారు. ప్రజలు తమ ప్రాథమిక హక్కుల కోసం ప్రాంతాలకు అతీతంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకరీతిన స్పందించారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్దించిందన్నారు. డా. అంబేద్కర్ ఆలోచన విధానం వల్లే తెలంగాణకు మార్గం సుగమం అయిందన్నారు. తెలంగాణ వికాస సమితి కోఆర్డినేటర్ ఒంటెద్దు నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జీ.బీ. రెడ్డి, తెలంగాణ వికాస సమితి నాయకులు శ్రీనివాస్, వెంకన్న, మహాత్మా గాంధీ లా కాలేజీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్ళపల్లి రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.