తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన రేపటి జనతా కర్ఫ్యూ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. జనతా కర్ఫ్యూని 12 గంటలు కాకుండా 24 గంటలు పాటించి దేశానికే ఆదర్శంగా నిలుద్దామన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు జనతా కర్ఫ్యూను పాటిద్దామన్నారు. కరోనా వైరస్ దేశంలో ఎవరిని ఏం చేసినా తెలంగాణవాళ్లను ఏం చేయలేకపోయిందనేలా మసులుకుందామన్నారు. రాష్ట్రంలో రేపు అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే పనిచేయనున్నట్లు తెలిపారు. మిగతా వారంతా ఎవరికి వారే స్వచ్ఛందంగా బంద్ పాటించాలన్నారు. ఇది ఒక కఠిన సమయమని, సంకట స్థితి అని, స్వయం నియంత్రణ పాటించాలన్నారు. అందరం కలిసి పాటిస్తే తప్ప ఇది సాధ్యం కాదన్నారు. స్వీయ నియంత్రణ మనల్ని కాపాడుతదన్నారు. మన కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, మన ప్రపంచం కోసం అందరం కలిసి జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందామన్నారు.
రాష్ట్రంలో 24 గంటలపాటు జనతా కర్ఫ్యూ : సీఎం కేసీఆర్